Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌కు అడ్డుకట్ట వేయబోయిన నెట్‌ఫ్లిక్స్‌కు భారీ షాక్

Netflix starts charging users for sharing passwords in select countries loses over 1 million subscribers

  • ఆదాయం పెంచుకునేందుకు పాస్‌వర్డ్ షేరింగ్‌కు నెట్‌ఫ్లిక్స్ బ్రేకులు
  • స్పెయిన్‌ సహా కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో కఠిన నిబంధనలు, సబ్‌స్క్రిప్షన్ చార్జీల పెంపు
  • వికటించిన నెట్‌ఫ్లిక్స్ వ్యూహం
  • స్పెయిన్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన వైనం
  • మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాంటార్ సర్వేలో వెల్లడి

పాస్‌వర్డ్ షేరింగ్‌కు అడ్డుకట్ట వేయబోయిన నెట్‌ఫ్లిక్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ చర్యలకు నిరసనగా ఏకంగా పది లక్షల పైచిలుకు మంది సబ్‌స్క్రైబర్లు సంస్థను వీడినట్టు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాంటర్ తాజాగా వెల్లడించింది. ఆదాయం పెంచుకునే క్రమంలో యూజర్ల పాస్‌వర్డ్ షేరింగ్‌కు బ్రేకులు వేసేందుకు నెట్‌ఫ్లిక్స్ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పెయిన్‌తో సహా కొన్ని దేశాల్లో కఠిన నిబంధనలకు తెరలేపింది. ముఖ్యంగా స్పెయిన్‌లో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజును రూ.500లకు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) పెంచింది. అంతేకాకుండా, యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకునేందుకు వీలులేకుండా సాంకేతికంగా కట్టుదిట్టమైన బ్రేకులు వేసింది. 

ఫలితంగా, 2023 మొదటి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ స్పెయిన్‌లో సుమారు పది లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్టు కాంటర్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. పాస్‌వర్డ్ షేరింగ్‌కు అడ్డుకట్ట వేయటమే దీనికి కారణమని అభిప్రాయపడింది. నెట్‌ఫ్లిక్స్ కోల్పోయిన సబ్‌స్క్రైబర్లలో మూడింట రెండొంతుల మంది తమ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకున్నట్టు వెల్లడించింది. వీరు సంస్థను వీడటంతో ఆర్థికంగా సంస్థకు అంత నష్టం లేకపోయినప్పటికీ మౌత్ పబ్లిసిటీ తగ్గి నెట్‌ఫ్లిక్స్ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. ఇటీవల ఇండియాలో అమెజాన్ కూడా సబ్‌స్క్రిప్షన్ ఫీజులు పెంచిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News