Tollywood: బాస్‌తో డీఎస్పీ బ్రేక్ ఫాస్ట్.. ఏంటీ మ్యాటర్?
- దేవిశ్రీ ప్రసాద్ కు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన చిరంజీవి
- బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన డీఎస్పీ
- వాల్తేరు వీరయ్యకు సంగీతం అందించిన దేవిశ్రీ
టాలీవుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవితో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి అనుబంధం ఉంది. దేవిశ్రీలో ప్రతిభను గుర్తించిన చిరు.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరి చూడని డీఎస్సీ సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. చిరుతో చాలా సినిమాల్లో పని చేసి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ మధ్యే వాల్తేరు వీరయ్యలో డీఎస్సీ ట్యూన్స్ ను చిరు వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో అలరించాయి. తాజాగా డీఎస్పీని చిరు తన ఇంటికి ఆహ్వానించారు. ఆదివారం ఉదయం ఆయనకు అల్పహారంతో ఆతిథ్యం ఇచ్చారు. చిరుతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను డీఎస్పీ ట్విట్టర్ లో అభిమానులతో పంచకున్నారు.
‘బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరెప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్ యూ సార్’ అని ఫోస్ట్ చేశారు. ఫొటో తీసిన చిరు కూతురు కొణిదెల సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, చిరు, డీఎస్పీ భేటీ అయ్యింది కేవలం బ్రేక్ ఫాస్ట్ కోసమేనా? మరేదైనా ప్రత్యేకత ఉందా? అని అభిమానులు ఆతృతగా ప్రశ్నిస్తున్నారు.
తన తదుపరి సినిమాలోనూ డీఎస్పీకి చిరు చాన్స్ ఇచ్చారని, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే కలిశారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు దేవీశ్రీ ప్రసాద్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, అల్లు అర్జున్ ‘పుష్ప.. ది రూల్’కు సంగీతం అందిస్తున్నారు.