Dhoni Review System: ధోనీ రివ్యూ అంటే అలా ఉంటుంది.. గురి తప్పని చెన్నై సారథి
- ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా, చెన్నై మధ్య మ్యాచ్
- 18వ ఓవర్ లో ఎల్బీడబ్ల్యూ అప్పీల్ కు చలించని అంపైర్
- ధోనీ రివ్యూ కోరడంతో అవుటైనట్టు ప్రకటన
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అనుభవం ఏ పాటిదో మరోసారి రుజువు చేశాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై ఫీల్డింగ్ చేస్తుండగా.. 18వ ఓవర్ లో తుషార్ దేశ్ పాండే బౌలింగ్ చేశాడు. 18వ ఓవర్ మూడో బంతి డేవిడ్ వీస్ ప్యాడ్ ను తాకింది. దీన్ని అప్పీల్ చేసినా అంపైర్ చలించలేదు. దీంతో ధోనీ తన చేతి సంకేతాల ద్వారా రివ్యూ కోరాడు.
బాల్ స్టంప్స్ ను తాకినట్టు రివ్యూలో తేలింది. దాంతో డేవిడ్ వీస్ అవుటైపోయాడు. ఇది జరగడం ఆలస్యం ట్విట్టర్లో చెన్నై జట్టు అభిమానులు పోస్టులతో ధోనీపై ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టారు. డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అంటూ కొత్త భాష్యం చెబుతూ టీట్ చేశారు. ‘‘ధోనీ రివ్యూ సిస్టమ్ సక్సెస్ రేటు 2023 ఐపీఎల్ సీజన్ లో 85.71 శాతం’’ అంటూ పోస్ట్ లు పెట్టారు. ధోనీ రివ్యూతో ఎల్బీబ్ల్యూగా తేలగా, కోల్ కతా జట్టు నితీష్ రాణా.. ఏంటో అన్నట్టుగా హావభావాలు ప్రదర్శించాడు.