Elon Musk: సెలబ్రిటీలు మొండికెత్తడంతో ఎలాన్ మస్క్ యూటర్న్?
- సబ్‌స్క్రిప్షన్ లేని సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాల నుంచి బ్లూ టిక్ తొలగింపు
- పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేది లేదన్న పలువురు సెలబ్రిటీలు
- తాజాగా సెలబ్రిటీల ఖాతాల్లో బ్లూ టిక్ పునరుద్ధరణ
- సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా బ్లూటిక్ కేటాయించిన ట్విట్టర్
- మస్క్ యూటర్న్ తీసుకున్నారా అన్న ప్రశ్న వైరల్
డబ్బుపెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే బ్లూ టిక్ అంటూ పట్టుపట్టిన ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మెట్టుదిగారా? సెలబ్రిటీలు మొండికెత్తడంతో యూటర్న్ తీసుకున్నారా? ప్రస్తుతం అనేక మందిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే. ఇటీవల డబ్బు కట్టని సెలబ్రిటీల ఖాతాల్లో బ్లూ టిక్ మార్క్స్‌ను తొలగించిన ట్విట్టర్ అకస్మాత్తుగా మళ్లీ వాటిని పునరుద్ధరించింది. డబ్బు చెల్లించకపోయినా ట్విట్టర్ వీటిని పునరుద్ధరించింది. దీంతో, మస్క్ మనసులో ఏముందనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
నకిలీల బెడదను తొలగించేందుకు వివిధ రంగాల్లోని ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్ గతంలో బ్లూటిక్ జారీ చేసింది. అయితే, ట్విట్టర్ ఆదాయం పెంచే ప్రణాళికల్లో భాగంగా మస్క్ కొంతకాలం క్రితం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభించారు. ఇందులో భాగంగా డబ్బు కట్టని సెలబ్రిటీల టిక్ మార్కునూ తొలగిస్తామని హెచ్చరించారు. అన్నట్టుగానే, రెండు రోజుల క్రితం డబ్బు కట్టని సెలబ్రిటీలు తమ టిక్ మార్కును కోల్పోయారు. అయితే, సబ్‌స్క్రిప్షన్ తీసుకోబోమని అనేక మంది భీష్మించుకుని కూర్చున్నారు. కొందరు బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలకు డబ్బు కట్టకపోయినా బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్ధరించడం చర్చనీయాంశంగా మారింది.