Munugodu Bypoll: రూ.25 కోట్ల ఆరోపణలపై రేవంత్‌ సవాల్‌.. ఈటల మౌనం!

bjp mla etala rajender silence on revanth reddy challenge

  • మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ నుంచి కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ముట్టాయన్న ఈటల
  • ఈ ఆరోపణలు నిజమని 24 గంటల్లో నిరూపించాలని రేవంత్ సవాల్
  • చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమని ప్రకటన
  • స్పందించని ఈటల రాజేందర్.. అమిత్ షా పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉండటమే కారణం!

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మునుగోడు బైపోల్ సందర్భంగా కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ముట్టాయని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా జరిగితే మొదట స్పందించేది సీఎం కేసీఆర్, మంత్రులేనని, ఎంత బుకాయించినా ఆ రెండు పార్టీలు ఎక్కడో ఒక చోట ఒకే వైపు ఉంటాయని విమర్శలు చేశారు.

ఈటల వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ తాము ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. ఈటల తన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలన్నారు.

అయితే ఇంత చర్చకు కారణమైన ఈటల రాజేందర్ మాత్రం రేవంత్ సవాల్‌పై మౌనం వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో బిజీగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రేపు హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. అందుకే ఈటల మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రేవంత్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News