Sundar Pichai: ఖర్చులు తగ్గించుకునేందుకు గూగుల్ తిప్పలు.. భారీ క్యాంపస్ నిర్మాణం నిలిపివేత
- శాన్‌హోసే నగరంలో భారీ క్యాంపస్ నిర్మాణానికి బ్రేకులు
- గతేడాది చివరి త్రైమాసికంలో అంచనాలను అందుకోని రాబడి
- గూగుల్‌కు ప్రకటనలపై రాబడుల్లో తగ్గుదల నమోదు
ఆదాయాలు తగ్గుతున్న తరుణంలో ఖర్చుల కట్టడికి గూగుల్ విశ్వప్రయత్నాలే చేస్తోంది. గూగుల్ తాజాగా శాన్ హోసే నగరంలో తలపెట్టిన ఓ భారీ క్యాంపస్ నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న సంస్థకు గూగుల్ నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో నిర్మాణం ప్రస్తుతానికి అటకెక్కినట్టే అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానించాయి.
డౌన్‌టౌన్ వెస్ట్ పేరిట గూగుల్ భారీ క్యాంపస్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందు కోసం 82 ఎకరాల్లో నేలను చదును చేసి నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. భవంతి నిర్మాణపనులను చేజిక్కించుకున్న నిర్మాణ సంస్థకు తదుపరి చర్యలపై గూగుల్ నుంచి ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం అందలేదు.
కాగా, గతేడాది చివరి త్రైమాసికంలో గూగుల్ ఆదాయం, రాబడులు సంస్థ అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో గూగుల్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో కోత పడింది. ఈ క్రమంలోనే ఖర్చులు తగ్గించుకునేందుకు గూగుల్ నానా యాతనా పడుతోంది. ఉద్యోగులను తొలగించడంతో పాటూ మిగిలిన వారికి ఆఫీసుల్లో ఇచ్చే అనేక సౌకర్యాలకు కత్తెర వేసింది. ఈ ఏడాది నియామకాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తామని కూడా ప్రకటించింది. ఇక తాజా త్రైమాసిక ఫలితాలను గూగుల్ త్వరలో విడుదల చేయనుంది.