annamlai: అవినీతిపై స్టాలిన్ ప్రజలకు సమాధానం చెప్పాలి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్
- బీజేపీని సైద్ధాంతికంగా ఎదిరించలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అన్నామలై
- వారు ఏడాదిలో రూ.30వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఆరోపణ
- శాంతిభద్రతలు కుప్పకూలాయని, వాగ్దానాలు అమలు చేయడం లేదన్న అన్నామలై
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ఫైల్స్ పేరిట స్టాలిన్ ప్రభుత్వం అక్రమాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. అంబేద్కర్ జయంతి రోజున డీఎంకే ఫైల్స్-1తో మీడియా ముందుకు వచ్చిన అన్నామలై... తాజాగా డీఎంకే ఫైల్స్ 2 పేరుతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. తన కుటుంబం అవినీతిలో కూరుకుపోయినందున ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలడం, స్టాలిన్ కుటుంబం ఒక్క ఏడాదిలోనే రూ.30 వేల కోట్లను అక్రమంగా సంపాదించడం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం, ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కనిపిస్తున్నాయని, ఇక నుండి ఇవి కుదరవని చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన ఆయన కుటుంబం చేస్తున్న ఈ చర్యకు స్టాలిన్ బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని, తగు చర్యలు తీసుకోవాలన్నారు.
డీఎంకే ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో తమిళనాడును విషపూరితం చేస్తోందన్నారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై బీజేపీ సీబీఐ విచారణను కోరుతుందన్నారు. అధికార డీఎంకే అక్రమ పద్ధతిలో సంపాదించిన డబ్బును మనీ లాండరింగ్ ద్వారా దాచే ప్రయత్నాలు సిగ్గుచేటు అన్నారు.
ఈస్టర్ పండుగ రోజు ఢిల్లీలోని చర్చిలో ప్రధాని ప్రార్థనలు చేశారని, రంజాన్ పండుగకు శుభాకాంక్షలు కూడా చెప్పారని, కానీ బీజేపీని సైద్ధాంతికంగా ఎదిరించలేని వారు తమ పార్టీ ఇతర మతాలకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, అల్లుడు శబరీశన్ ఒకే ఏడాదిలో రూ.30 వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఒక జర్నలిస్టుతో తమిళనాడు ఆర్థిక మంత్రి బీడీఆర్ పళనివేల్ త్యాగరాజన్ పేర్కొన్న ఓ ఆడియో క్లిప్ ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ అంతకుముందు పత్రికా సమావేశంలో ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి నమ్మిన బంటు అయిన ఆర్థిక మంత్రి ఆరోపణలకు సంబంధించి డీఎంకే ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకుండా మౌనం వహించడం తమకు ఓటు వేసిన ప్రజలకు అన్యాయం చేయడమేనని స్టాలిన్ గ్రహించాలని అన్నారు.