Blue Tick: ఓ ట్విట్టర్.. డబ్బులు కట్టాను.. చేతులు జోడించి అడుగుతున్నా బ్లూటిక్ పెట్టు.. నీ కాళ్ల మీద పడమంటావా ఏమిటి?: అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్
- బ్లూటిక్ కోసం చార్జ్ చేస్తున్న ట్విట్టర్
- సబ్ స్క్రిప్షన్ ఫీజులను చెల్లించని ఖాతాలకు బ్లూ టిక్ తొలగింపు
- తన ఖాతాకు వెరిఫైడ్ ట్యాగ్ తీసేయడంపై స్పందించిన అమితాబ్
- సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ కోసం డబ్బు చెల్లించానని వెల్లడి
ట్విట్టర్ ఖాతాకు ‘బ్లూటిక్’ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని ఇటీవల సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సబ్ స్క్రిప్షన్ ఫీజులను చెల్లించని ఖాతాలకు ఈరోజు బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. దీంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన మహామహులంతా బ్లూ టిక్ ను కోల్పోయారు. ఈ జాబితాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు.
తన ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్ తీసేయడంపై ట్విట్టర్ లోనే అమితాబ్ బచ్చన్ స్పందించారు. సబ్ స్క్రిప్షన్ ఫీజును చెల్లించానని, బ్లూటిక్ ను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు ఆయన అవధీ (ప్రయాగ్ రాజ్ లో మాట్లాడే భాష) లో ఫన్నీగా రాసుకొచ్చారు.
‘‘హే ట్విట్టర్! వింటున్నావా? నేను సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ కోసం డబ్బు చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందు నీలి కమలాన్ని (బ్లూ లోటస్) తిరిగి ఉంచండి. తద్వారా నేను అమితాబ్ బచ్చన్ ని అని ప్రజలు తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. మీ కాళ్ల మీద కూడా పడాలా?’’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘సహనానికి ప్రతి ఫలం బ్లూ టిక్.. మీరు 3, 4 రోజులు ఆగండి’’ అని ఒకరు.. ‘‘ మిస్టర్ బచ్చన్.. ఆయన (మస్క్) విదేశీయుడు. ఎవ్వరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే’’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.