Ambati Rayudu: వైసీపీలో చేరుతున్న క్రికెటర్ అంబటి రాయుడు?

Ambati Rayudu joining YSRCP

  • రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ గతంలోనే చెప్పిన రాయుడు
  • తాజాగా సీఎం జగన్ పై ప్రశంసల జల్లు
  • రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఓ ట్వీట్ ను రాయుడు రీట్వీట్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా... అంబటి రాయుడు దాన్ని రీట్వీట్ చేశాడు. అంతేకాదు... 'మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్' అని కామెంట్ చేశాడు. దీంతో రాయుడు వైసీపీలో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. 

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. రాయుడిని బీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్టు కూడా వార్తలు వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కాపు సామాజికవర్గానికి చెందినవాడు. దీంతో ఆయన జనసేనలో కూడా చేరే అవకాశాలున్నాయని పలువురు భావించారు. టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ ఒక పత్రికలో వార్త కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు జగన్ పై ప్రశంసలు కురిపించడంతో... ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి, ఏం జరగబోతోందో వేచి చూడాలి.

Ambati Rayudu
Cricketer
YSRCP
Jagan
  • Loading...

More Telugu News