Double dekker: హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు నడిచే రూట్లు ఇవే..!

Double dekker bus routes in Hyderabad

  • పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా స్పెషల్ రూట్ ఏర్పాటు
  • ఇటీవల రూ.13 కోట్లతో 6 డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసిన హెచ్ఎండీఏ
  • కొన్ని రోజుల పాటు ఉచితంగానే ప్రయాణించే అవకాశం కల్పించినట్లు అధికారుల వెల్లడి

హైదరాబాద్ లోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రకటించింది. ఇటీవల రూ.12.96 కోట్లు వెచ్చించి 6 డబుల్ డెక్కర్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే! అయితే, ఈ బస్సులు ఏ రూట్ లో తిరుగుతున్నాయనే విషయంపై స్పష్టత లేక వీటికి ఆదరణ లభించడంలేదు. ఈ నేపథ్యంలో బస్సులు తిరిగే రూట్లను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్విట్టర్ లో వెల్లడించారు. నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేలా ప్రత్యేక రూట్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు.

బస్సులు నడిచే రూట్లు ఇవే..
బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను చుట్టొచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం ట్యాంక్ బండ్ నుంచి డబుల్ డెక్కర్ బస్సులు బయలుదేరి తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్, ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

టికెట్ ధర వివరాలు..
డబుల్ డెక్కర్ బస్సుల్లో కొన్నిరోజుల పాటు ఉచితంగానే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఆపై కనీస ఛార్జీగా ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. టికెట్ ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి తేవాలనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. పర్యాటకుల స్పందనను బట్టి మరికొన్ని రూట్లలో కూడా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

More Telugu News