Andhra Pradesh: సీఎంను ఆశీర్వదించేందుకే స్వామీజీ కలిశారు..: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD chairman yv subbareddy press meet
  • విజయకుమార్ స్వామీజీతో ఏపీ సీఎం జగన్ భేటీపై వివరణ
  • గతంలోనూ పలువురు స్వామీజీలను తీసుకెళ్లి సీఎంను కలిశానని వెల్లడి
  • స్వామీజీల ఆశీర్వాదంతో మేలు జరుగుతుందనే నమ్మకమే కారణం
  • దీనిని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి
స్వామీజీల ఆశీస్సులతో మంచి జరుగుతుందని నమ్ముతామని, అందుకే రాష్ట్రానికి వచ్చే స్వామీజీలను కలిసి ఆశీస్సులు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అందుకోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశీస్సులు అందించాలని విజయకుమార్ స్వామీజీని కోరానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి స్వామీజీ ఆశీస్సులు ఉంటే ఆయనకు, ఆయనతో పాటు రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించామని చెప్పారు. 

విజయకుమార్ స్వామీజీ మాత్రమే కాదు.. గతంలో చాలామంది స్వామీజీలతో వెళ్లి సీఎం జగన్ కు ఆశీర్వాదం ఇప్పించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. స్వరూపానంద స్వామీజీ, చినజీయర్ స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వామీజీలను.. ఇలా చాలామంది స్వామీజీలతో తీసుకువెళ్లి ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇప్పించానని వివరించారు.

విజయకుమార్ స్వామీజీ, ముఖ్యమంత్రి జగన్ భేటీపై మీడియాలో ఆరోపణలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయకుమార్ స్వామీజీ విజయవాడ వస్తున్నారని తెలిసి తాను ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశీర్వదించాలని స్వామీజీని కోరానని చెప్పారు. నిజానికి ఆ రోజు తాను విజయవాడలో లేనని సుబ్బారెడ్డి వివరించారు. దీంతో ఆయన అంగీకరించి జగన్ ను కలిశారని తెలిపారు.

దీనిపై రెండు పత్రికలలో లాబీయింగ్ జరుగుతోందని రాశారంటూ టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. ఓ పెద్ద మీడియా సంస్థ అధిపతికి చెందిన బంధువుల విమానంలోనే స్వామీజీ విజయవాడ వచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక విమానం పంపి మరీ స్వామీజీని వారు ఎందుకు పిలిపించుకున్నారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దయచేసి మతపరమైన నమ్మకాలను రాజకీయంతో ముడిపెట్టొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
vijaykumar swamiji
YV Subba Reddy
Jagan
YSRCP

More Telugu News