Google: కృత్రిమ మేథపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక
- ఏఐని సరైన విధంగా వినియోగించకపోతే విపరిణామాలు తప్పవన్న గూగుల్ సీఈఓ
- కృత్రిమ మేథలో తప్పుడు సమాచారం వ్యాప్తికి ఆస్కారం ఉందని వెల్లడి
- ఈ సాంకేతికతకు నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచన
కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) సాంకేతికతపట్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నూతన సాంకేతికతకు సమాజం అలవాటు పడేంతవరకూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ టెక్నాలజీని సరైన విధంగా వినియోగించకుంటే హానికర పరిణామాలు కలుగుతాయని హెచ్చరించారు. ఏఐ ప్రభావాన్ని తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని కూడా చెప్పుకొచ్చారు.
ఏఐతో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న ఆయన ఈ సాంకేతికత నియంత్రణకు వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏఐపై నిర్ణయాలు ఏ ఒక్క కంపెనీ సొంతం కాదని తేల్చి చెప్పారు. కంపెనీల మధ్య పోటీతో ఏఐ మానవసమాజంవైపు దూసుకొస్తుందని వ్యాఖ్యానించారు. దీని ప్రభావానికి లోనుకాని కంపెనీ లేదా ఉత్పత్తి ఉండదని చెప్పారు.
ఇటీవలే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఏఐపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలల పాటు ఏఐ పరిశోధనలకు బ్రేక్ ఇవ్వాలని సూచించారు. తాజాగా గూగుల్ సీఈఓ కూడా ఇదే సూచన చేయడం గమనార్హం. ఏఐ ప్రభావాలపై ప్రముఖ సంస్థల సీఈఓలతో పాటూ అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు.