CBI: భాస్కర్ రెడ్డి పారిపోయే అవకాశం ఉందని అరెస్ట్ చేశాం: సీబీఐ
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
- ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్
- కీలకసాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సీబీఐ
- భాస్కర్ రెడ్డి విచారణకు సహకరించడంలేదని వెల్లడి
- విచారణ తప్పుదోవ పట్టించేలా సమాధానాలు ఇచ్చారని వివరణ
వివేకా హత్య కేసులో ఈ ఉదయం అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాదులో జడ్జి ఎదుట హాజరుపర్చడం తెలిసిందే. భాస్కర్ రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై భాస్కర్ రెడ్డి న్యాయవాదులు రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. జడ్జి నివాసంలో జరిగిన విచారణ సందర్భంగా, సీబీఐ రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది.
భాస్కర్ రెడ్డి పారిపోతాడని భావించి ముందే అరెస్ట్ చేశామని వెల్లడించింది. అతడు విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందని, కీలకసాక్షలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వివరించింది . విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి సహకరించడంలేదని, విచారణను తప్పుదోవ పట్టించేలా సమాధానాలు ఇచ్చారని సీబీఐ వెల్లడించింది.
వివేకాపై భాస్కర్ రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉందని, 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉందని తెలిపింది. ఈ మేరకు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కారణాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.
హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డిది కీలకపాత్ర అని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నెల ముందే వివేకా హత్యకు కుట్ర పన్నారని, భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే హత్యకు కుట్ర జరిగిందని వివరించింది. సీఐ శంకరయ్యను భాస్కర్ రెడ్డి బెదిరించారని తెలిపింది. వివేకా హత్యలో సహనిందితులకు పెద్దమొత్తంలో డబ్బు అందిందని వెల్లడించింది.