dating app: డేటింగ్ యాప్ ప్రొఫైల్ లో టెన్త్, ఇంటర్ మార్కుల వివరాలు
- సహజీవన భాగస్వామి కోసం ఓ వ్యక్తి అన్వేషణ
- డేటింగ్ ప్రొఫైల్ లో విద్యార్హతలు, మార్కులు
- ఐఐటీ బాంబేలో చదివానని, ఇన్ఫోసిస్ లో ఉద్యోగమంటూ ఆకర్షణ మంత్రం
లింక్డిన్ లేదా నౌకరీ వంటి ప్రొఫెషనల్, జాబ్ పోర్టళ్లలో ప్రొఫైల్ ఎలా ఉండాలి..? మన ప్రతిభ ఏమిటో ఉద్యోగుల కోసం అన్వేషించే సంస్థలకు తెలిసేలా ఉండాలి. కానీ ఓ ప్రబుద్ధుడు డేటింగ్ పోర్టల్ లో పెట్టిన ప్రొఫైల్ చూస్తే..? ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
నేడు డేటింగ్ యాప్ కు ఆకర్షితులయ్యే వారి సంఖ్య మన దేశంలోనూ పెరుగుతోంది. దీంతో పదుల సంఖ్యలో డేటింగ్ వేదికలు పుట్టుకొస్తున్నాయి. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లు అన్నింటిలోనూ యూజర్లకు ప్రొఫైల్ పేజీ ఉంటుంది. దీన్ని చూసి కానీ, ఇతరులు మన గురించి తెలుసుకోలేరు. సాధారణంగా ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్, డేటింగ్ వేదికలపై ఇచ్చే సమాచారం వేర్వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వేర్వేరు ప్లాట్ ఫామ్ లు.
కానీ, ఓ వ్యక్తి తన విద్యార్హతలు, వాటిల్లో సాధించిన మార్కుల వివరాలను డేటింగ్ యాప్ లో ఉంచడంతో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. 24 ఏళ్ల అంకిత్ ఝా అనే వ్యక్తి తనకు పదో తరగతిలో 94 శాతం, 12వ తరగతిలో 99.5 శాతం మార్కులు వచ్చాయని, జేఈఈ మెయిన్స్ ను 1027తో క్లియర్ చేశానని, ఎన్ టీఎస్ఈ స్కాలర్, కేవీపీఐ స్కాలర్ ను అంటూ ఇలా అన్ని వివరాలు రాసుకుంటూ వచ్చాడు. ఐఐటీ బోంబే నుంచి సీఎస్ఈ పూర్తి చేశానని, ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నానని, ఎత్తు 5.10 అడుగులు అంటూ ప్రొఫైల్ ను నింపేశాడు. దీర్ఘకాలం పార్ట్ నర్ కోసం చూస్తున్నానంటూ అతడు పేర్కొన్నాడు. డేటింగ్ కోసం వచ్చేవారు మార్కులను కూడా చూస్తారా.! అంటూ పలువురు ముక్కుపై వేలేసుకుంటున్నారు.