Uttar Pradesh: పోలీసుల సమక్షంలోనే యూపీ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడి కాల్చివేత!

 Gangster Atiq Ahmed and His Brother Shot Dead
  • అతీక్ అహ్మద్‌పై దాదాపు 100 క్రిమినల్ కేసులు
  • వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఘటన
  • రిపోర్టర్లు ప్రశ్నలు అడుగుతుండగానే కాల్పులు
  • విచారణ కోసం జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్(60), ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. వైద్య పరీక్షల కోసం వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అతీక్ అహ్మద్‌పై దాదాపు 100 క్రిమినల్ కేసులున్నాయి. మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ కాల్పులు జరగడంతో అందరూ షాకయ్యారు.

వైద్య పరీక్షల కోసం వారిద్దరినీ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు తుపాకులతో అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. కాల్పులతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో జర్నలిస్టు కూడా గాయపడినట్టు అధికారులు తెలిపారు.

అఖిలేశ్ యాదవ్ ఫైర్
కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై విచారణ కోసం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముగ్గురు సభ్యులతో కూడిన జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలో అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపడంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని మండిపడ్డారు.

మూడు రోజుల క్రితమే ఎన్‌కౌంటర్‌లో కుమారుడు
మూడు రోజుల క్రితం ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతీక్ కుమారుడు అసద్ ప్రాణాలు కోల్పోయాడు. అతీక్ అహ్మద్‌కు ఐదుగురు కుమారుల్లో అసద్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, ఇద్దరు జైల్లో ఉన్నారు. మైనర్లు అయిన మరో ఇద్దరు గృహ నిర్బంధంలో ఉన్నారు. 

గుంపులోంచి కొందరు వ్యక్తులు బయటకు వచ్చిన అతీక్, ఆయన సోదరుడిపై కాల్పులు జరిపినట్టు ఆయన న్యాయవాది విజయ్ మిశ్రా తెలిపారు. కాల్పులు జరిపినప్పుడు తాను వారి పక్కనే ఉన్నట్టు చెప్పారు. నిందులు పలు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా పనిచేసిన అతీక్ అహ్మద్ ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలారు. అలాగే, 2005లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆయన న్యాయవాది ఉమేశ్ పాల్  హత్య కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Uttar Pradesh
Atiq Ahmed
Ashraf Ahmed
Prayagraj
Yogi Adityanath

More Telugu News