uber: ఫోన్లో తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు రేట్లు పెంచేస్తున్న ఉబెర్?
- క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌పై సంచలన కథనం ప్రచురించిన బెల్జియం పత్రిక
- యూజర్ల ఫోన్లో చార్జింగ్ బట్టి క్యాబ్ ధరల నిర్ధారణ జరుగుతోందని వెల్లడి
- ఆరోపణలను ఖండించిన ఉబెర్
- క్యాబ్‌లకు ఉన్న డిమాండ్‌ను బట్టే ధరల నిర్ధారణ అని స్పష్టీకరణ
మీరు యాప్‌లో క్యాబ్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోండి. ఇంతలో ఫోన్‌లో చార్జింగ్ అయిపోవచ్చింది. మరోవైపు, క్యాబ్ రేట్ రోజూకంటే కాస్త పెరిగినట్టు అనిపించింది. అప్పుడు మీరేం చేస్తారు? చార్జింగ్ అయిపోతోంది కదా అని యాప్‌లో కనిపించిన రేటుకే క్యాబ్ బుక్ చేసుకుంటారు కదూ! మీరే కాదు.. ఎవరైనా అంతే. అయితే, ప్రజల్లో ఇలాంటి ధోరణి ఉందని కనిపెట్టిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ తక్కువ చార్జింగ్ ఉన్న ఫోన్లలో ఎక్కువ ధర చూపిస్తోందంటూ బెల్జియంకు చెందిన డిర్నియర్ హ్యూయరీ వార్తాపత్రిక ఓ సంచలన కథనం ప్రచురించింది.
చార్జింగ్ ఆధారంగా రేట్ల పెంపు ఆరోపణలపై తాము చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం రుజువైందని ఆ వార్తాపత్రిక పేర్కొంది. 84 శాతం చార్జింగ్ ఉన్న ఫోన్ కంటే 12 శాతం ఉన్న ఫోన్లోంచి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఒకే దూరానికి రూ.100 (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) మేర ధర అధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే.. ఉబెర్ మాత్రం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఆ ప్రాంతంలో క్యాబ్‌లకు ఉన్న డిమాండ్‌లను బట్టే ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు జరుగుతాయని, దీన్నే డైనమిక్ ప్రైసింగ్ విధానమని అంటారని వివరించింది.
ఇదిలా ఉంటే, వినియోగదారులు తమ ఫోన్ చార్జింగ్ తక్కువగా ఉన్న సందర్భాల్లో అధిక ధరలు చెల్లించేందుకు వెనకాడరని తాము గుర్తించినట్టు ఉబెర్ ఆర్థిక పరిశోధన విభాగం మాజీ అధిపతి కీత్ చెన్ 2019 నాటి ఇంటర్వ్యూలో తెలిపారు.