YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో ఉదయ్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కాసేపట్లో హైదరాబాద్ కు తరలింపు

Udaykumar Reddy Gajjala Now In CBI Custody
  • వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి ఉదయ్ వెళ్లినట్టు గుర్తించిన సీబీఐ
  • హత్య రోజున భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకౌట్ ద్వారా నిర్ధారణ
  • పులివెందులలో అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కు తరలింపు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పులివెందులలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి విచారణ జరిపారు. సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కాసేపట్లో ఆయనను కడప నుంచి హైదరాబాద్ కు సీబీఐ అధికారులు తరలించనున్నారు. మరోవైపు, ఉదయ్ ను అరెస్ట్ చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారమిచ్చారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పాటు ఉదయ్ కూడా ఘటనా స్థలానికి వెళ్లినట్టు సీబీఐ గుర్తించింది. ఆ రోజున అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను అక్కడికి రప్పించడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించినట్టు భావిస్తోంది. అంతేకాదు, వివేకానందరెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉదయ్‌ను సీబీఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది. ఇప్పుడు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది. హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్టు గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది.
YS Vivekananda Reddy
Avinash Reddy
Udaykumar Reddy Gajjala
CBI

More Telugu News