Tollywood: దుబాయ్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘నంది’ అవార్డుల వేడుక
- తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఇవ్వనున్న టీఎఫ్‌సీసీ
- టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 పేరిట ప్రదానోత్సవం
- బ్రోచర్ ను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్, ప్రతాని
- 2021, 22లో విడుదలైన చిత్రాలు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రతాని
తెలుగు చిత్ర పరిశ్రమలో చాన్నాళ్ల తర్వాత నంది అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కలిసి నిన్న అవార్డుల బ్రోచర్‌ను విడుదల చేశారు. అవార్డుల కోసం 2021, 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని, దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు అందజేస్తామని ప్రతాని తెలిపారు.
గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది పురస్కారలను ప్రతాని రామకృష్ణ ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరమని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు ప్రత్యేకంగా ఓ నంది అవార్డు కేటాయించాలని ఆయన సూచించారు. తెలంగాణ సంప్రదాయాల్ని ప్రతిబింబించి, ఇక్కడ టూరిజం పెరగడానికి దోహదం చేసే చిత్రాల్ని ప్రత్యేకంగా గుర్తించి, వాటికి నగదు పురస్కారాలు ఇస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.