IPL: తల ఎత్తుకో.. నువ్వో చాంపియన్ వి అంటూ ప్రత్యర్థి బౌలర్ కు కేకేఆర్ ఫ్రాంచైజీ బాసట
- గుజరాత్ పై ఉత్కంఠ విజయం సాధించిన కేకేఆర్
- యష్ దయాల్ వేసిన చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్
- ఆత్మవిశ్వాసం కోల్పోవద్దంటూ ట్వీట్ చేసిన ప్రత్యర్థి కేకేఆర్ టీమ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్ (జిటి)తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లో రింకూ సింగ్ వీరోచిత ఇన్నింగ్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అసాధారణ విజయం సాధించింది. చివరి ఓవర్లో కేకేఆర్ కు 29 పరుగులు అవసరం అవగా.. యువ బ్యాటర్ రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లతో విధ్వంసం సృష్టించి జట్టును గెలిపించాడు. రింకూపై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. ఆ ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ యష్ దయాల్ కు ఈ మ్యాచ్ పీడకలగా మారింది. ఓవర్ ముగిసిన తర్వాత దయాల్ చాలా బాధ పడుతూ కనిపించాడు.
అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దంటూ ప్రత్యర్థి జట్టు అయిన కేకేఆర్ ఫ్రాంచైజీ అతడికి ప్రత్యేక సందేశం ఇచ్చి అందరి మనసులు గెలిచింది. ‘తల ఎత్తుకో యష్. ఈ రోజు కష్టంగా గడిచింది అంతే. క్రికెట్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. నువ్వు ఒక ఛాంపియన్ వి. బలంగా తిరిగి రాబోతున్నావు’ అని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. దీనికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. మిమ్నల్నీ అంతే గౌరవిస్తున్నాం అని ట్వీట్ చేసింది. థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన కేకేఆర్ ను అభినందించింది.
ఇక, హార్దిక్ పాండ్యా స్థానంలో గుజరాత్ స్టాండిన్ కెప్టెన్ గా వ్యవహరించిన రషీద్ ఖాన్ కూడా యష్ కు అండగా నిలిచాడు. ‘రింకూ కొన్ని నమ్మశక్యం కాని షాట్లు కొట్టాడు. యష్ తన అత్యుత్తమ డెలివరీలను వేశాడు. కానీ అవి పని చేయలేదు. ఈ క్రెడిట్ మొత్తం బ్యాటర్ రింకూదే’ అని రషీద్ పేర్కొన్నాడు.