Delhi LG: ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యుల్లానే ప్రవర్తిస్తారు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన వీకే సక్సేనా
- సర్టిఫికెట్ విషయంలో మరీ అంత గర్వపడాల్సిన అవసరంలేదని వ్యాఖ్య
- ఎల్జీ విమర్శలపై మండిపడ్డ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీశీ
విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను చూసి మరీ ఎక్కువగా గర్వపడాల్సిన అవసరంలేదని, అవి కేవలం రిసీప్టులు మాత్రమేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. కొంతమంది ఐఐటీలలో ఉన్నత చదువులు పూర్తిచేసినప్పటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై సక్సేనా స్పందించారు. మన తెలివితేటలు, మన ప్రవర్తనే నిజమైన విద్యార్హతను చెబుతుందని కేజ్రీవాల్ కు చురకలంటించారు.
ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన కామెంట్లను విన్నానని సక్సేనా చెప్పారు. అయితే, ఎవరైనా సరే తమ సర్టిఫికెట్లను చూసుకొని మరీ ఎక్కువగా గర్వపడకూడదని సూచించారు. కొన్ని రోజులుగా విద్యార్హతలకు సంబంధించి జరుగుతున్న చర్చను చూస్తున్నానని తెలిపారు. ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని సక్సేనా చెప్పారు.
ఎల్జీ సక్సేనా వ్యాఖ్యలపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి, ఆప్ లీడర్ అతీశీ మండిపడ్డారు. దేశంలోకెల్లా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఢిల్లీ ఎల్జీ అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. ఐఐటీలలో చదివిన వారు పెద్ద పెద్ద సంస్థలకు సీఈవోలుగా పనిచేస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని అతీశీ గుర్తుచేశారు. తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను దాచేవారే ఇతరుల సర్టిఫికెట్లపై ప్రశ్నలు సంధిస్తారని విమర్శించారు. ఎల్జీ సక్సేనా కూడా తన సర్టిఫికెట్లు మీడియా ముందు చూపించాలని, అలాగే బీజేపీ లీడర్ల సర్టిఫికెట్లను కూడా చూపించాల్సిందిగా కోరాలని అతీశీ డిమాండ్ చేశారు.