Sharad Pawar: మీ దృష్టిలో దేశ సమస్యలంటే ఇవేనా?: శరద్ పవార్ ఫైర్
- నాయకుల డిగ్రీల గురించి మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేస్తున్నారన్న పవార్
- రాజకీయ సమస్యలు అంటే ఇవేనా? అని ప్రశ్న
- నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్య
ప్రధాని మోదీ డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పాలంటూ విపక్షాలకు చెందిన నేతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశం కారణంగా పార్లమెంటు సమావేశాలు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ... నాయకుల విద్యార్హతల గురించి మాట్లాడుతూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. ఇంతకంటే పెద్ద సమస్యలు మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మన దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, వాటి గురించి మాట్లాడాలని హితవు పలికారు.
దేశంలోని నిరుద్యోగం, శాంతి భద్రతల సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించాలని... వీటిని వదిలేసి పనికిమాలిన విషయాల గురించి మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేస్తున్నారని శరద్ పవార్ విమర్శించారు. కాలేజీ డిగ్రీల గురించి మాట్లాడుతున్నారని... నీ డిగ్రీ ఏంది? నా డిగ్రీ ఏంది? ఇలాంటి అంశాలపై మాట్లాడుతున్నారని... రాజకీయ సమస్యలు అంటే ఇవేనా? అని మండిపడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీస్తున్నారని... ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మహారాష్ట్రలో పంటలు దెబ్బతిన్నాయని... ఇలాంటి అంశాలపై చర్చ కొనసాగితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.