Bandi Sanjay: అర్ధరాత్రి వేళ బండి సంజయ్ అరెస్ట్.. కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వీడియో ఇదిగో!

Karimngara Police Arrested Bandi Sanjay At Mid Night

  • అర్ధరాత్రి బండి సంజయ్‌ను తమతో రమ్మన్న పోలీసులు
  • ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్న
  • పోలీసులతో వాగ్వివాదం
  • బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిన పోలీసులు
  • టెన్త్ పేపర్ లీకేజీ కేసులోనే అరెస్ట్ చేసి ఉంటారని అనుమానం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో గత రాత్రి కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ అత్తమ్మ ఇటీవల చనిపోయారు. నేడు తొమ్మిది రోజుల కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. దీంతో ఆయన జ్యోతినగర్‌లోని అత్తమ్మ వాళ్లింటికి చేరుకున్నారు.

బండి సంజయ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న పోలీసులు జ్యోతి నగర్ వెళ్లి సంజయ్‌ను తమతోపాటు స్టేషన్‌కు రావాల్సిందిగా కోరారు. అయితే, ఎందుకు రావాలి? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని సంజయ్ ప్రశ్నిస్తూ వారితో వెళ్లేందుకు నిరాకరించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక చెబుతామంటూ ఏసీపీ తుల శ్రీనివాసరావు సారథ్యంలోని పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో సంజయ్‌కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ పోలీసులు ఆయనను బలవంతంగా తమ వ్యానులోకి ఎక్కించి తీసుకెళ్లారు.

మరోవైపు, సంజయ్ ను అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు జులం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్ట్ చేసిన బీజేపీ అధ్యక్షుడిని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో బండి సంజయ్ గతంలో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన వెళ్లకుండా తన లీగల్ టీంను పంపించారు. మరోవైపు, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలోనే ఆయనను అరెస్ట్ చేసి ఉంటారని కూడా చెబుతున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు.

More Telugu News