Sai Sudarshan: సాయి సుదర్శన్ సూపర్... గుజరాత్ టైటాన్స్ కు మరో విక్టరీ
- ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసిన ఢిల్లీ
- 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టైటాన్స్
- 62 పరుగులతో అజేయంగా నిలిచిన సాయి సుదర్శన్
ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. 163 పరుగుల లక్ష్యాన్ని టైటాన్స్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది.
యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఎడమచేతివాటం సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేసి టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 29 పరుగులు చేశాడు.
ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (14), శుభ్ మాన్ గిల్ (14), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5) స్వల్ప స్కోర్లకే అవుటైనా... గుజరాత్ టైటాన్స్ నెగ్గిందంటే అది సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ వల్లే! లక్ష్యఛేదనలో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా సుదర్శన్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్కియా 2, ఖలీల్ అహ్మద్ 1, మిచెల్ మార్ష్ 1 వికెట్ తీశారు. ఢిల్లీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి.