Question Paper: టెన్త్ పేపర్ లీక్ కాలేదు... ప్రశ్నాపత్రాన్ని కాపీ చేశారు: వరంగల్ సీపీ
- వాట్సాప్ లో హిందీ ప్రశ్నాపత్రం
- మరోసారి కలకలం
- ఓ బాలుడు క్వశ్చన్ పేపర్ ను ఫొటో తీసుకున్నాడన్న సీపీ
- ఓ చానల్ మాజీ ఉద్యోగి పాత్ర కూడా ఉందని వెల్లడి
- సెక్షన్-5 కింద కేసు నమోదు చేసినట్టు వివరణ
తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం కూడా వాట్సాప్ లో దర్శనమివ్వడం పట్ల వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, ప్రశ్నాపత్రాన్ని కాపీ చేశారని వివరణ ఇచ్చారు. తన స్నేహితులకు ఇవ్వాలని క్వశ్చన్ పేపర్ ను బాలుడు ఫొటో తీసుకున్నాడని వెల్లడించారు. కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి ఆ బాలుడు క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడని సీపీ వివరించారు.
ఆ ప్రశ్నాపత్రం ఫొటోను బాలుడు... శివగణేశ్ కు పంపాడని తెలిపారు. శివగణేశ్ ఆ పేపర్ ను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడని వెల్లడించారు. ఈ ప్రశ్నాపత్రం కాపీయింగ్ లో ఓ టీవీ చానల్ మాజీ ఉద్యోగి పాత్ర కూడా ఉందని సీపీ రంగనాథ్ చెప్పారు.
ప్రశ్నాపత్రం కాపీయింగ్ ఘటనపై సెక్షన్-5 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రశ్నాపత్రం ఇంకెవరికి వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.