Nara Lokesh: గూగుల్ అబద్ధం చెప్పదుగా కేతిరెడ్డీ: ఆధారాలు బయటపెట్టిన లోకేశ్

Lokesh responds to Kethireddy challenge

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేశ్ ఆరోపణలు
  • ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరిన కేతిరెడ్డి
  • తప్పు చేసుంటే రాజీనామా చేస్తానని ప్రకటన
  • ఆధారాలు బయటపెట్టిన లోకేశ్

యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేశ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎర్రగుట్టను ఆక్రమించాడని ఆరోపణలు చేశారు. గుట్ట పైన ఉన్న 20 ఎకరాలను కబ్జా చేశారని ఆధారాలు కూడా బయటపెడతామని పేర్కొన్నారు  దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అమరావతి వద్దనున్న చంద్రబాబు నివాసానికి వెళ్లి సవాల్ చేశారు. లోకేశ్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే సవాల్ కు లోకేశ్ వెంటనే స్పందించారు. ఆ మేరకు ఆధారాలుగా గూగుల్ మ్యాప్స్ ను బయట పెట్టారు. "నిన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ చేస్తూ ఎర్రగుట్ట మీద ఉన్న భూముల్ని రైతుల నుంచి కొన్నానని పేర్కొన్నారు. అయితే రికార్డుల ప్రకారం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం... కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో కొన్నది కేవలం 25.38 ఎకరాలు మాత్రమే. అయితే గుట్టపైన మొత్తం 45 ఎకరాలు ఆక్రమణలో ఉంది. మిగిలిన 20 ఎకరాలు మొత్తం కబ్జా చేశారు. 

గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేతిరెడ్డి ల్యాండ్ ను కొలవగా 45.47 ఎకరాలుగా చూపిస్తోంది. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడినుంచి వచ్చింది. దమ్ముంటే అందరి సమక్షంలో ఎర్రగుట్టపై ఉన్న భూమిని కొలిపించే దమ్ము ఉందా కేతిరెడ్డి?" అని సవాల్ విసిరారు. 

"ఎర్రగుట్టపై సర్వే నంబర్లు 904, 905, 908, 909 లో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో రైతుల నుంచి భూములు కొన్నట్టు రికార్డులో ఉంది. మొత్తం రైతుల నుంచి 25.38 ఎకరాలు కొన్నట్టు రికార్డుల్లో ఉంది. అయితే ఇందులో 8 ఎకరాలు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డులో ఉంది. కర్నూలుకు చెందిన గాలి వసుమతికి ఇక్కడ వంశపారంపర్యంగా భూములు ఎలా సంక్రమించాయి?

ఇది ఒక కోణం అయితే... మొత్తం రికార్డుల ప్రకారం కేతిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసింది కేవలం 25.38 ఎకరాలు మాత్రమే. అయితే ఎర్రగుట్టపై మొత్తం 45.47 ఎకరాలు ఆక్రమించుకొని విలాసవంతమైన ఫామ్ హౌస్, తోటలు, బోటింగ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నాడు.

కేతిరెడ్డి అక్రమాన్ని గూగుల్ మ్యాప్ పట్టించింది. గూగుల్ మ్యాప్ ద్వారా కేతిరెడ్డి స్వాధీనంలో ఉన్న భూమిని కొలవగా 45.47 ఎకరాలు చూపిస్తోంది. రికార్డుల్లో 25.38 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఏం సమాధానం చెప్తావు కేతిరెడ్డి? అధికారులు అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదుగా" అని పేర్కొన్నారు.

More Telugu News