Elon Musk: ట్విట్టర్‌ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ వివరణ ఇదీ!

Elon musk reveals why he had changed twitter logo
  • ట్విట్టర్ లోగో మార్పుతో నెట్టింట గగ్గోలు
  • ఎందుకిలా? అంటూ నెటిజన్ల ప్రశ్నల వర్షం
  • కలకలం పతాకస్థాయికి చేరాక తీరిగ్గా స్పందించిన మస్క్
  • ట్విట్టర్ పేరుమార్పుపై ఓ నెటిజన్ సూచనను నెట్టింట పంచుకున్న వైనం
  • నాడు తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నానని వ్యాఖ్య
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మంగళవారం ఓ సరికొత్త సంచలనానికి తెరతీశారు. హఠాత్తుగా ట్విట్టర్ లోగోను మార్చేసి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఒకప్పుడు ట్విట్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది నీలి రంగు పిట్ట బొమ్మ. దాని స్థానంలో డోజ్‌కాయిన్ అనే క్రిప్టోకెరెన్సీపై ఉండే కుక్క బొమ్మను ట్విట్టర్ లోగోగా ఎంపిక చేశారు. మంగళవారం ట్విట్టర్ వెబ్‌వర్షన్‌లో ఈ కుక్క బొమ్మ కనిపించడంతో కలకలం రేకెత్తింది. ఇది చూసిన నెటిజన్లందరూ ఎందుకిలా అని అడగడం మొదలెట్టారు. 

ఈ ప్రశ్న కాస్తంత వైరల్ అయ్యాకే మస్క్ తీరిగ్గా రంగంలోకి దిగారు. నెటిజన్ల ప్రశ్నకు తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ‘‘ట్విట్టర్ కొనుగోలు చేయి.. దాన్ని లోగోను డోజ్ కుక్కగా మార్చేయ్’’ అంటూ కొన్నాళ్ల క్రితం ఓ నెటిజన్ చేసిన సూచనకు మస్క్  అది అద్భుతంగా ఉంటుందని జవాబిచ్చారు. నాటి చాట్‌ తాలూకు స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన మస్క్.. నాడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా అంటూ ఓ తుంటరి సమాధానం ఇచ్చారు. దీంతో..నెటిజన్లు మరోసారి నోరెళ్లబెట్టారు.
Elon Musk
Twitter

More Telugu News