Sharmila: కలిసి పోరాడుదాం రండి.. ‘టీ-సేవ్‘ అంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు
- బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ‘సేవ్’ను ప్రతిపాదించిన షర్మిల
- ఏప్రిల్ 10న సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందిద్దామని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి
- నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా పనిచేద్దామని సూచన
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పై ప్రధాన ప్రతిపక్షాలకు దీటుగా షర్మిల పోరాటం చేస్తున్నారు. రోజుకో ఆందోళనకు పిలుపునిస్తున్నారు. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ఆమె.. కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చి సంచలనం రేపారు. తాజాగా మరో ప్రతిపాదనను ప్రతిపక్షాల ముందు పెట్టారు.
ఈరోజు మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడేందుకు టీ- సేవ్ (స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకన్సీస్, ఎంప్లాయ్ మెంట్) అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
పార్టీలకు అతీతంగా టీ సేవ్ ద్వారా పోరాటం చేద్దామన్నారు. ‘‘రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దాం. దయచేసి అన్ని పార్టీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని షర్మిల కోరారు.
నియంత పాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేళ్లుగా అన్యాయమే జరుగుతోందని ఆమె అన్నారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి, పోరాడాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
‘‘హౌజ్ అరెస్టులు చేసి, అక్రమ కేసులు పెట్టి ఎవరూ ప్రశ్నించకుండా, పోరాడకుండా కేసీఆర్ నిరంకుశ సర్కారు నిర్బంధిస్తోంది. అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి, పోరాడితేనే కేసీఆర్ మెడలు వంచగలం. నిరుద్యోగులకు న్యాయం చేయగలం’’ అని షర్మిల చెప్పారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.