Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కల్యాణ్.. అమిత్ షా, నడ్డాలతో భేటీ కానున్న జనసేనాని

Pawan Kalyan to meet Amit Shah and JP Nadda

  • నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న పవన్, నాదెండ్ల మనోహర్
  • ఉదయ్ పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన జనసేనాని
  • ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్న పవన్ ఢిల్లీ టూర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అయితే ఏ సమయంలో అపాయింట్ మెంట్ ఇచ్చారనే విషయం తెలియరాలేదు. పవన్ తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇటీవలే తన కుటుంబంతో కలిసి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు పవన్ వెకేషన్ కు వెళ్లారు. ఉదయ్ పూర్ నుంచే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దల పిలుపు మేరకే ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పవన్ ను బీజేపీ పెద్దలు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధమవుతోందని ఇప్పటికే అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలను పవన్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీల మధ్య ప్రస్తుతం పొత్తు ఉన్నప్పటికీ, రెండు పార్టీలు కలిసి పనిచేయడం మాత్రం జరగడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన అభిమానులు ఓటు వేయలేదని బీజేపీ నేత మాధవ్ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే భేటీలతో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.

More Telugu News