Jagan: మరి కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం
- ‘గడపగడపకూ మన ప్రభుత్వం’, ‘జగనన్నే మన భవిష్యత్తు’పై ఎమ్మెల్యేలతో కలిసి జగన్ సమీక్ష
- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం
- ఎమ్మెల్యేల పనితీరునూ సమీక్షించనున్న సీఎం
- కేబినేట్లో మార్పులపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. పార్టీ ఎమ్మెల్యేలతో నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్.. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’, ‘జగనన్నే మన భవిష్యత్తు’ తదితర కార్యక్రమాలను సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం అధారంగా వారికి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటూ నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయ కర్తలు కూడా పాల్గొననున్నారు . ఉదయం 11.00 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అందిన సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పనితీరు మార్చుకోవాలంటూ సీఎం సూటిగా చెప్పే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. కేబినెట్ కూర్పులో మార్పులు ఉంటాయని సీఎం జగన్ గతంలోనే హింట్ ఇచ్చారు. దీంతో నేడు జరగబోయే సమీక్షా సమావేశంలో ఈ విషయమై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో.. నేటి సమావేశంలో ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ ఏపీలో నెలకొంది.