upasana: అందంగా లేనని, లావుగా ఉన్నానని నన్ను ట్రోల్ చేశారు: ఉపాసన

ram charan wife upasana latest comments aboutvon her

  • పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నానన్న ఉపాసన
  • డబ్బు కోసమే చరణ్ తనను పెళ్లి చేసుకున్నారని కొందరు విమర్శించారని వ్యాఖ్య
  • ట్రోల్స్ వచ్చాయని తాను కుంగిపోలేదని.. వాటిని జయించానని వెల్లడి

గతంలో తనపై ట్రోల్స్ వచ్చాయని, నెగటివ్ కామెంట్స్ చేశారని రామ్ చరణ్ సతీమణి ఉపాసన చెప్పారు. చరణ్ తో పెళ్లి జరిగిన కొత్తలో తాను బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నానని తెలిపారు. డబ్బు కోసమే చరణ్ తనను పెళ్లి చేసుకున్నారని విమర్శలు చేశారని అన్నారు. ముంబైకి చెందిన ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఉపాసన పంచుకున్నారు.

చరణ్, తాను కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం అయ్యామని ఉపాసన చెప్పారు. మొదటి నుంచి చరణ్ ఏదో ఒక చాలెంజ్ చేస్తుండేవాడని, తాను కూడా సవాళ్లు విసిరేదాన్నని తెలిపారు. ఇలా తమ మధ్య ప్రేమ మొదలైందని వివరించారు. తామిద్దరం ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటామని చెప్పారు. తమవి భిన్నమైన కుటుంబ నేపథ్యాలని.. నమ్మకం, ప్రశంసలు, కొన్ని సమయాల్లో రాజీలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు.

‘‘పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని, డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నారని కొందరు మాట్లాడారు’’ అని ఉపాసన చెప్పుకొచ్చారు. విమర్శలు చేసిన వారిని తాను నిందించాలని అనుకోవడం లేదని, వాళ్లకు తన గురించి ఏమీ తెలియదని, అందుకే అలా మాట్లాడి ఉండొచ్చన్నారు. ఈ పదేళ్లలో తన గురించి వారికి తెలిసిందని, ఇప్పుడు తనపై వారి అభిప్రాయం మారిపోయిందని అన్నారు. 

‘‘మనం విమర్శలను స్వీకరించే విధానంలోనే అంతా ఉంటుంది. ట్రోల్స్ వచ్చాయని నేను కుంగిపోలేదు. వాటిని జయించాను. నా విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నేనొక చాంపియన్ లా ఫీల్ అవుతున్నా. ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను మరింత ధైర్యవంతురాలినయ్యాను’’ అని ఉపాసన చెప్పారు.

More Telugu News