Kanchan Uike: చనిపోయిందనుకున్న అమ్మాయి 9 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది... కానీ!

Woman appeared after nine years she declared dead

  • మధ్యప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన
  • 2014లో ఆచూకీ లేకుండా పోయిన కంచన్
  • మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • 2021లో తండ్రి, సోదరుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • తండ్రి సహకారంతో సోదరుడే కంచన్ ను చంపాడని పోలీసుల అభియోగాలు
  • గత బుధవారం గ్రామంలో ప్రత్యక్షమైన కంచన్

మధ్యప్రదేశ్ లో విస్మయకర సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిందనుకున్న అమ్మాయి ఇటీవల తిరిగొచ్చింది. చింద్వారా జిల్లా జోపనాలా గ్రామానికి చెందిన కంచన్ ఉయికే 2014లో కనిపించకుండా పోయింది. అప్పటికి ఆమెకు 14 ఏళ్లు. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఆచూకీ మాత్రం దొరకలేదు. 

అయితే, 2021లో పోలీసులు ఆ అమ్మాయి తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేశారు. వారిద్దరే కంచన్ ను హత్య చేసి మామిడి తోటలో పూడ్చివేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కంచన్ తండ్రికి బెయిల్ లభించగా, సోదరుడు మాత్రం జైల్లో ఉన్నాడు. 

కాగా, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ... హత్యకు గురైందనుకున్న కంచన్ బుధవారం నాడు ప్రత్యక్షమైంది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. తమ కుటుంబానికి చెందిన ఓ సమాధిని తవ్విన పోలీసులు ఓ అస్థిపంజరాన్ని కంచన్ ది అని భావించారని వెల్లడించారు. 

కంచన్ ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి. కుటుంబ కలహాల వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయి ఉజ్జయిన్ లో స్థిరపడింది. తనను హత్య చేశారంటూ సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కూడా ఆమెకు తెలియదు. ఇటీవల స్వగ్రామానికి రావడంతో అసలు విషయం వెల్లడైంది.

Kanchan Uike
Madhya Pradesh
Police
  • Loading...

More Telugu News