Harish Rao: మందుల ధరలను 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం: హరీశ్ రావు

Harish Rao fires on BJP

  • పేద, మధ్య తరగతికి వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతోందన్న హరీశ్ రావు
  • మందుల ధరలు పెరిగితే సామాన్యులకు మరింత భారం అవుతుందని వ్యాఖ్య
  • అవకాశం దొరికినప్పుడల్లా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని మండిపాటు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలను 12 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని విమర్శించారు. ఇది ముమ్మాటికీ పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని అన్నారు. యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్లు, జ్వరం, ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మెడిసిన్స్ ధరలను పెంచితే అది పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత భారం అవుతుందని చెప్పారు. 

అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడాన్నే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. బీజేపీ చెపుతున్న అమృత్ కాల్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అచ్చే దిన్ అంటే ఇది కాదని... ఇది సామాన్యుడు సచ్చే దిన్ అని అన్నారు. మన దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.

  • Loading...

More Telugu News