Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పురోగతి నివేదికను పార్లమెంటు ముందుంచిన కేంద్రం
- పోలవరంపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రశ్న
- సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా అని అడిగిన కనకమేడల
- సవరించిన అంచనాలపై వివరణ ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ
పోలవరం ప్రాజెక్టు పురోగతి నివేదికను కేంద్రం ప్రభుత్వం నేడు పార్లమెంటు ముందుంచింది. 2017-18 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. 2019లో తమ వద్దకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు అని తెలిపింది. ప్రతిపాదిత అంచనాలను కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని కేంద్రం వివరించింది.
ఆర్సీసీ అధ్యయనంలో అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా నిర్ధారణ అయిందని పేర్కొంది. 2013-14 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.29,027 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చుల వల్లే అంచనా వ్యయం పెరిగిందని వివరించింది. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇప్పటివరకు రూ.13,463 కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది.
పోలవరం సవరించిన అంచనాలపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానమిచ్చింది. తొలి దశలో పోలవరంలో 41.15 మీటర్ల వద్ద నీరు నిల్వ చేయడం జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. సవరించిన అంచనాలపై ఒకే కమిటీ రెండు సిఫారసులు చేసిందని వివరించింది.
సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా? అని కనకమేడల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టు నివేదికను సభ ముందుంచింది.