Prakash Raj: ప్రకాశ్ రాజ్ కామెడీ జోన్ లోకి వస్తే ఆడుకునేవాణ్ణి: బ్రహ్మానందం
- ప్రకాశ్ రాజ్ గొప్పనటుడన్న బ్రహ్మానందం
- ఆయన డైలాగ్ చెబుతుంటే పులకరించిపోయానని కితాబు
- ప్రకాశ్ రాజ్ తో నటించడం తేలికైన విషయం కాదని వెల్లడి
- ఆయన జోన్లోకి వెళ్లడం వలన భయపడ్డానని వ్యాఖ్య
ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన 'రంగమార్తాండ' సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. చాలా కాలం తరువాత కృష్ణవంశీకి హిట్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. తాజా ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ నటనను గురించి బ్రహ్మానందం ప్రస్తావించారు. "ప్రకాశ్ రాజ్ అద్భుతమైన నటుడు. తన పాత్ర పట్ల తనకి పూర్తి అవగాహన ఉన్న రేర్ ఆర్టిస్ట్ ఆయన" అని అన్నారు.
"ప్రకాశ్ రాజ్ అనర్గళంగా డైలాగ్స్ చెబుతుంటే ఒక నటుడిగా పులకరించిపోయాను. తను స్వతహాగా కన్నడ అనే విషయం మరిచిపోయాను. ప్రకాశ్ రాజ్ చాలా పెద్ద డైలాగ్ మరిచిపోకుండా గొప్పగా చెప్పాడు. తనది తెలుగు లాంగ్వేజ్ కాదు .. హిందీ మాట్లాడితే హిందీవాడని అనుకుంటాము .. మలయాళంలో మాట్లాడితే మలయాళీ అనుకుంటాము. తమిళ మాట్లాడితే తమిళియన్ అనుకుంటాము. తెలుగు మాట్లాడితే తెలుగే వీడా అనే ఫీలింగ్ కలిగిస్తాడు" అని చెప్పారు.
"ప్రకాశ్ రాజ్ నటించే విధానం .. ఆయన మూమెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయనతో పోటాపోటీగా నటించడం అంత తేలికైన విషయమేం కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చింది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ లో టెన్షన్ పడ్డాను ... భయపడ్డాను. ప్రకాశ్ రాజ్ నా కామెడీ జోన్ లోకి వస్తే ఆడుకుంటాను. కానీ ఆయన జోన్లోకి నేను వెళ్లాను .. అందువలన సహజంగానే భయం ఉంటుంది కదా" అని అన్నారు.