Raghu Rama Krishna Raju: ముఖ్యమంత్రికి వీలైతే నన్ను రాజ్యాంగ సలహాదారుగా నియమించుకోవచ్చు: రఘురామ
- ఏపీ ప్రభుత్వ సలహాదారుల అంశంపై రఘురామ వ్యాఖ్యలు
- పదో తరగతి వాళ్లు కూడా ఇద్దరు ముగ్గురున్నారని వెల్లడి
- ఎందుకూ పనికిరానివాళ్లని వ్యాఖ్యలు
- సీఎంకు రాజ్యాంగంలో ఓనమాలు తెలియవని విమర్శలు
ఏపీ ప్రభుత్వ సలహాదారులపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పెద్ద జోక్ అని, ఈ సలహాదారుల్లో పదో తరగతి వాళ్లు కూడా ఇద్దరు ముగ్గురున్నారు... కడప వాళ్లు... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఎందుకూ పనికిరానివాళ్లని వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టిస్ కూడా ఈ సలహాదారుల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని వెల్లడించారు.
ఏమిటీ సలహాదారులు అని చీఫ్ జస్టిస్ ప్రశ్నిస్తే, ఏపీ ప్రభుత్వం తూచ్ అందని, ఇకపై ఎవరిని పడితే వారిని సలహాదారులుగా నియమించబోమని నిర్ణయించుకుంటుందని రఘురామ ఎద్దేవా చేశారు.
"ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏదైనా తప్పు చేస్తే శిక్షించవచ్చు... ప్రభుత్వ సలహాదారు ఏదైనా అవకతవక చేసి వెళ్లిపోతే అతడిపై ఎలా చర్యలు తీసుకోగలరని కోర్టు ఒక సూటి ప్రశ్న వేస్తే... రాజ్యాంగంలో ఓనమాలు కూడా తెలియని మన ముఖ్యమంత్రి తమ సలహాదారులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వారిని అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి తీసుకువస్తాం అని చెప్పారు. రాజ్యాంగం పట్ల ఏమాత్రం అవగాహన లేని సలహాదారులు, ముఖ్యమంత్రి ఉండడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది.
రాజ్యాంగంలో ఆర్టికల్ 16 ప్రకారం... ఒక ఉద్యోగం ఉంటే అర్హత ఉన్నవాళ్లందరి నుంచి ఉత్తమమైన వాళ్లను ఎంచుకోవాలి. రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ఏబీసీడీలు తెలియవు కాబట్టి ఎవరైనా రాజ్యాంగ నిపుణుడిని సలహాదారుగా పెట్టుకోవచ్చు. పత్రికా ప్రకటన ఇస్తే సరైనవాళ్లు వస్తారు... రాజ్యాంగంపై పరీక్ష పెట్టి వాళ్లలో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యమంత్రికి వీలైతే నన్ను రాజ్యాంగ సలహాదారుగా పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి వల్ల ఢిల్లీలో ఖాళీగా ఉంటున్న సమయంలో రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్ ను నేర్చుకున్నాను" అంటూ రఘురామ వ్యంగ్యం ప్రదర్శించారు.