Sharmila: దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే.. కేసీఆర్ పై షర్మిల మండిపాటు
- వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన షర్మిల
- ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదని విమర్శ
- సీఎం, మంత్రులు గాలి మోటార్లో వచ్చి, గాలి మాటలు చెబుతారని ఎద్దేవా
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట పోయి, రూ.1,250 కోట్ల మేర నష్టపోయినా దొరకు దున్నపోతు మీద వానపడ్డట్టేనని విమర్శించారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను షర్మిల పరిశీలించారు.
‘‘అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నష్టపోయినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదు. ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ రైతుల గోస పట్టదా?’’ అని ప్రశ్నించారు.
‘‘గతంలో జరిగిన పంట నష్టానికి కూడా రూపాయి చెల్లించలేదు. ముఖ్యమంత్రి, మంత్రులకు గాలి మోటార్లో వచ్చి, గాలి మాటలు చెప్పడం తప్ప సాయం చేయడం చేతకాదు’’ అని అన్నారు. తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.