ED: ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు
- పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం
- మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న పిళ్లై కస్టడీ గడువు
- ఈలోపే కీలక సమాచారం సేకరించేందుకు అధికారుల ప్రయత్నం
లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న కవిత.. సోమవారం ఉదయం పదకొండు గంటలకు ముందే ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను కన్ ఫ్రంటేషన్ పద్ధతిలో విచారిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ముఖ్యంగా సౌత్ గ్రూప్ వ్యవహారాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి అందించినట్లు ఆరోపిస్తున్న వంద కోట్ల వ్యవహారంపై విచారిస్తున్నారు.
అరుణ్ రామచంద్ర పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ అన్న ఆరోపణల నేపథ్యంలో వివిధ ఆర్థిక లావాదేవీలపై ఇద్దరినీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ కేసులో పిళ్లై కస్టడీ సోమవారం మధ్యాహ్నానికి ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పిళ్లైని తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి కవితను కన్ ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిళ్లై కస్టడీ ముగిసేలోపు కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.