Bollywood: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. బాలీవుడ్ నటుడికి బెదిరింపు ఈమెయిల్!

Bollywood Actor Salman Khan receives threat email
  • సల్మాన్ సన్నిహితుడికి అందిన బెదిరింపు ఈమెయిల్
  • నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
  • గ్యాంగ్‌స్టర్లు గోల్డీబ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సహా ఈమెయిల్ పంపిన రోహిత్ గార్గ్‌పై కేసు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ మరోమారు బెదిరింపులు ఎదుర్కొన్నారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావించిన నిందితుడు.. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన సన్నిహితుడు ఒకరికి ఈమెయిల్ పంపాడు. అంతేకాదు, సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని కూడా అందులో పేర్కొనడం గమనార్హం. 

సల్మాన్ టీం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై కేసు నమోదు చేశారు. సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్‌ శనివారం ఈ బెదిరింపు ఈమెయిల్ అందుకున్నారు. పంపిన వ్యక్తిని రోహిత్ గార్గ్‌గా గుర్తించారు. దీంతో గార్గ్, గోల్డీబ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌పై సల్మాన్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

‘‘మీ బాస్ (సల్మాన్ ఖాన్)తో గోల్డ్ బ్రార్ మాట్లాడాలనుకుంటున్నారు. బిష్ణోయ్ ఇంటర్వ్యూను ఆయన చూడాలి. ఒకవేళ చూడకుంటే కనుక చూసేలా చేయండి. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలనుకుంటే సల్మాన్ (గోల్డీబ్రార్‌తో) మాట్లాడాలి. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటే కనుక మాకు చెప్పండి. ఈసారి మీకు సకాలంలో సమాచారం ఇచ్చాం. వచ్చేసారి మాత్రం షాక్ అవుతారు’’ అని ఆ ఈమెయిల్‌లో హెచ్చరిక జారీ చేశారు.
Bollywood
Salman Khan
Threat Email
Lawrence Bishnoi

More Telugu News