Perni Nani: చంద్రబాబు కోసమే ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు.. పవన్ కల్యాణ్ పై పేర్ని నాని విమర్శలు

perni nani press meet

  • కాపుల్లో 60 శాతం మంది ముఖ్యమంత్రి జగన్ వెంటే ఉన్నారన్న నాని 
  • పవన్ పేరెత్తకుండా మహానుభావుడంటూ వెటకారం
  • ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలనే వైసీపీ కోరుకుంటోందని వెల్లడి
  • తన కుటుంబంలో నుంచి తానొక్కడే రాజకీయాల్లో ఉన్నానన్న పవన్ వ్యాఖ్యలకు ఖండన
  • జనసేన ఆవిర్భావం జరిగే నాటికే చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారని గుర్తుచేసిన నాని

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రస్తుతం అవసరం వచ్చిందనే ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆరోపించారు. మంగళవారం రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మచిలీపట్నం వేదికపై చేసిన ఆరోపణలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పేరు ఎత్తకుండా ‘ఓ మహానుభావుడు’ అంటూ సంబోధిస్తూ విమర్శలు కురిపించారు.

తన బాస్ చంద్రబాబుకు అవసరం వచ్చిందనే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ఈ మహానుభావుడు ప్రకటించారని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోటీచేయాలని, అప్పుడే వారి నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తుపడతారని చెప్పారు. వైసీపీ పార్టీ కూడా అదే కోరుకుంటోందని తేల్చిచెప్పారు. 2014 నుంచి 2019 వరకు అందించిన పాలననే మళ్లీ ఇప్పుడు అందిస్తామని ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? అని నాని సవాల్ చేశారు.

కులరహిత రాజకీయాలంటూనే మళ్లీ కాపుల కోసం పనిచేస్తున్నానని మహానుభావుడు అంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కాపులకు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. కాపులందరమూ కలిసి చంద్రబాబును ఆశ్రయిద్దామని అంటున్నారని.. కాపులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని నాని అన్నారు. కాపుల్లో 60 శాతం మంది జగన్ వెంటే ఉన్నారని, ఉంటారని, ఇకపైనా ఉండబోతున్నారని స్పష్టం చేశారు.

పదేళ్ల క్రితం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలనూ ఆయన విమర్శించారు. 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నది ఈ మహానుభావుడేనని, మరి ప్రజారాజ్యం పార్టీ రాజకీయ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు. తన కుటుంబంలో తను తప్ప ఇంకెవ్వరూ రాజకీయాల్లో లేరని పవన్ చెప్పడాన్ని నాని తప్పుబట్టారు.

ఈ మహానుభావుడు జనసేన స్థాపించిన సమయంలో చిరంజీవి ఏ హోదాలో ఉన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జనసేన ఆవిర్భావ వేడుక జరిపారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పదవి రాజకీయం కాదా? అని నిలదీశారు. ఆ మహానుభావుడి మాటలన్నీ గందరగోళమేనని, ఓసారి తనకు డబ్బులు అక్కర్లేదని అంటాడని, మరోసారి డబ్బులు అవసరమయ్యే సినిమాలు చేస్తున్నానని అంటాడని పేర్ని నాని విమర్శించారు.

ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలు చేసి ఒక్కో సినిమాకు పదిహేను కోట్లో పద్దెనిమిది కోట్లో తీసుకున్నానని ఇటీవలే చెప్పిన సదరు మహానుభావుడు మళ్లీ నిన్న మాటమార్చాడని చెప్పారు. సినిమా షూటింగ్ కు రోజుకు రెండు కోట్లు తీసుకుంటానని అన్నాడని ఆరోపించారు. పవన్ పై ఓ మీడియా సంస్థ అధిపతి చేసిన వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని ఓ మీడియా సంస్థ యజమాని చెప్పారని, ఈ మహానుభావుడు కుదుర్చుకున్నాడో లేదో తెలియని ఒప్పందం గురించి ఆయనకెలా తెలిసిందోనని వ్యాఖ్యానించారు. ఆ ఒప్పందం గురించి ఆరోపణలు చేసిన మీడియా సంస్థ యజమానిని ప్రశ్నించాల్సింది పోయి ప్రజల ముందు మాట్లాడటమేంటని అడిగారు. ఆ విషయంలో ప్రజలకు సంబంధం ఏంటని పేర్ని నాని పవన్ ను నిలదీశారు.

Perni Nani
YSRCP
Pawan Kalyan
janasena
Chandrababu
  • Loading...

More Telugu News