Pawan Kalyan: ఆ పదాన్నే వకీల్ సాబ్ సినిమాలో వాడాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Machilipatnam

  • జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం
  • మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ
  • హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్
  • ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
  • రెండు చోట్ల ఓడిపోయినా వెనుకంజ వేయలేదని స్పష్టీకరణ

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 2014 మార్చి 14న జనసేన పార్టీ తొలి ఆవిర్భావ సభ నిర్వహించామని, ఆ రోజున తన వెంట ఇంతమంది లేరని, తనను నమ్మిన కొద్దిమంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. సగటు మనిషికి మేలు చేయాలన్న ఆలోచన, కొంత రాజకీయ చైతన్యంతో ఆనాడు పార్టీ స్థాపించానని తెలిపారు. 

తనను ఒక్కటే ప్రశ్న వేధించేదని... పబ్లిక్ పాలసీలను చేసేది ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు అయితే... వాటి ఫలితాలను ప్రజలు ఎందుకు అనుభవించాలి? అని ఆలోచించేవాడినని పవన్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను స్వార్థం కోసం ఆలోచించాలా, లేక ప్రజల కోసం నిలబడాలా అనే ఆలోచనలో సమాజం వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 

చాలామంది రాజకీయ పార్టీలు స్థాపించినా ఐదేళ్లు కూడా నడపలేక వెనుదిరిగారని, కానీ తాను రెండు చోట్ల ఓడిపోయినా సరే తట్టుకుని నిలబడ్డానని స్పష్టం చేశారు. మహా అయితే ఏమవుతుంది... ప్రాణాలు పోతాయి... అంతేతప్ప రాజకీయ పోరాటంలో వెనుకడుగు వేసేదిలేదని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. 

ఇవాళ జనసేన పార్టీకి 6.50 లక్షల మంది క్రియాశీలక జనసైనికులు ఉన్నారని సగర్వంగా ప్రకటించారు. ఎవరైనా ఎదిగేకొద్దీ బలపడతారని, కానీ తాము దెబ్బపడే కొద్దీ బలపడుతున్నామని, ఇది తాము సాధించిన విజయం అని వివరించారు. ఈ పదేళ్లలో ఎన్నో దెబ్బలు తిన్నామని, మాటలు పడ్డామని, ఓటమి చవిచూశామని, అయినా నిలబడ్డామని చెప్పారు. ఏదో ఒకరోజు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఆ విధంగానే పనిచేసుకుంటూ వెళుతున్నానని తెలిపారు. అలాగే నానీ పాల్కీవాలా గారి మాటలు తన స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన "లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ" అని చెప్పారని, ఆ మాటలనే వకీల్ సాబ్ సినిమాలో ఉపయోగించానని పవన్ వెల్లడించారు. ధర్మం కోసం పనిచేయడమే తనను నడిపిస్తోందని అన్నారు. 

రెండున్నర దశాబ్దాల పాటు నలిగి, ఆలోచనలకు పదునుపెట్టి 7 సిద్ధాంతాలతో పార్టీ స్థాపించానని వివరించారు. తనకు అన్ని కులాలు సమానమేనని, ఒక కులాన్ని గద్దె ఎక్కిండానికి తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. అన్ని కులాలకు అవకాశం కల్పించాలని, కులాలను ఐక్యంగా కలపాలని, కులాలను కలిపే ఆలోచనా విధానంతో పార్టీ స్థాపించానని పవన్ కల్యాణ్ వివరించారు. 

మన సమాజం కులవృత్తుల మీద ఆధారపడినదని, అలాంటి సమాజంలో అన్ని కులాలతో కలిసి జీవించాలే తప్ప కులాలను విడదీసి కాదని హితవు పలికారు. కులాల గురించి మాట్లాడడం తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్... గుర్రం జాషువా, శ్రీశ్రీ, గోరటి వెంకన్నల రచనలను ప్రస్తావించారు. 

ఇవాళ తనను కులం పేరుతో దూషిస్తూ, కులాన్ని అమ్మేస్తానని ప్రచారం చేస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. ఏ కులంలో పుట్టాలన్న చాయిస్ లేక తాను కాపు కులంలో పుట్టానని, కానీ తాను అన్ని కులాల అభ్యున్నతి గురించి ఆలోచిస్తానని, తాను విశ్వనరుడిని అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News