USA: అమెరికాలో మూతబడిన మరో బ్యాంకు!
- సిగ్నేచర్ బ్యాంకును తమ నియంత్రణలోకి తీసుకున్న అధికారులు
- డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు డిపాజిటర్లకు అవకాశం
- బ్యాంకుల వైఫల్యాలకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా బ్యాంకింగ్ రంగంలో కలకలం కొనసాగుతోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విఫలమై వారం కూడా గడవకమునుపే మరో బ్యాంకును అధికారులు మూసేశారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్టు అక్కడి బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ తాజాగా పేర్కొంది. రోజుల వ్యవధిలోనే మరో బ్యాంకు మూతబడటం అమెరికాను కుదిపేస్తోంది. డిపాజిటర్ల సొమ్ముకు రక్షణగా ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ).. సిగ్నేచర్ బ్యాంకును తన నియంత్రణలోకి తీసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గతేడాది ముగిసే నాటికి సిగ్నేచర్ బ్యాంకుకు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. డిపాజిటర్లు బ్యాంకులో 88.59 బిలియన్ డాలర్ల నిధులు దాచుకున్నారు. ఇక డిపాజిటర్లకు తమ నిధులు విత్‌డ్రా చేసుకునే అవకావం ఉందని ఎఫ్‌డీఐసీ పేర్కొంది. తద్వారా.. డిపాజిటర్లు, కస్టమర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది.
సిగ్నేచర్ బ్యాంకులోని మూడో వంతు డిపాజిట్లు క్రిప్టో రంగం నుంచి వచ్చినవేనని తెలుస్తోంది. బ్యాంకు మాత్రం స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్, బ్యాంకింగ్ సహా తొమ్మిది విభాగాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే.. తమ వద్ద ఉన్న క్రిప్టో డిపాజిట్లను 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని ఇటీవలే ప్రకటించింది. ఇక సిగ్నేచర్ బ్యాంకు మూసివేత క్రిప్టో రంగానికి భారీ కుదుపని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా స్పందించారు. కస్టమర్ల డిపాజిట్లు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చారు.ఈ పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.