Maharas: రైతు ఆత్మహత్యలు కొత్తేం కాదు: మహారాష్ట్ర మంత్రి
- పంట నష్టాన్ని తెలుసుకునేందుకు నియోజకవర్గంలో మంత్రి పర్యటన
- రైతుల ఆత్మహత్యలు కొత్తేం కాదని వ్యాఖ్య
- రైతు సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేశామని వెల్లడి
- కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యలు కొత్త సమస్య కాదన్న ఆయన..కొన్నేళ్లుగా ఈ ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిలోద్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలపై మీడియా ప్రశ్నించగా మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘‘ ఈ సమస్య కొత్తదేం కాదు. అయితే.. నా నియోజకవర్గంతో పాటూ రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగకూడదు’’ అన్నారు.
స్థానిక పోలీసుల ప్రకారం.. మార్చి 3 నుంచి 12 తారీఖుల మధ్య ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే స్థానికుల కథనం ప్రకారం.. మొత్తం ఆరుగురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక రైతు ఆత్మహత్యల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. గతవారం అకాల వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రి సత్తార్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం.. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.