USA: కరోనా పుట్టుక రహస్యాలను బయటపెట్టనున్న అమెరికా?

US House votes unanimously to declassify Covid origins intel bill sent to Biden

  • కరోనా రహస్యాలను బహిర్గతం చేసే బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
  • శ్వేత సౌధానికి చేరిన బిల్లు
  • అధ్యక్షుడి ఆమోదముద్రపై కొనసాగుతున్న ఉత్కంఠ

కరోనా పుట్టుకకు సంబంధించిన అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేసే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 419-0 ఓట్ల తేడాతో బిల్లు పాసైంది. ప్రస్తుతం ఈ బిల్లు అధ్యక్షుడి కార్యాలయానికి చేరుకుంది. అయితే.. అధ్యక్షుడు బైడెన్ ఈ బిల్లుపై ఆమోదముద్ర వేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. బిల్లులోని అంశాలను పరిశీలిస్తున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. బిల్లుపై సంతకం చేస్తారా అని బైడెన్‌ను మీడియా ప్రశ్నించగా ‘‘నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. 

అంతకుమునుపు అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుపై సునిశితమైన చర్చ జరిగింది. ‘‘ఈ ప్రాణాంతకమైన వైరస్‌కు సంబంధించి అమెరికన్లలో అనేక సందేహాలున్నాయి. వైరస్ ఎందుకు ఉనికిలోకి వచ్చింది? భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు తలెత్తకుండా ఏం చేయాలి? అనే ప్రశ్నలకు అమెరికన్లు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఓ సభ్యుడు కామెంట్ చేశారు. ‘‘కొవిడ్‌కు సంబంధించి అన్ని అంశాలపై స్పష్టత కోరే హక్కు అమెరికా ప్రజలకు ఉంది’’ అని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ మైఖేల్ టర్నర్ వ్యాఖ్యానించారు. ‘‘వైరస్‌ను ఎలా సృష్టించారు? దాని పుట్టుక ప్రకృతి సహజమైన పరిణామమా లేక ల్యాబ్‌‌లో జరిగిన ప్రయోగాల ఫలితమా?’’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో జరిగిన ప్రయోగాలు, కరోనా వైరస్‌ పుట్టుకకు మధ్య సంబంధంపై ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు ఈ బిల్లును ప్రతిపాదించారు. అయితే.. కరోనా జన్మరహస్యంపై ఇంటెలిజెన్స్ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించిందా? లేదా ల్యాబ్‌లో ప్రయోగాల కారణంగా ఈ వైరస్ ఉనికిలోకి వచ్చిందా? అన్ని దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కరోనా సంక్షోభంతో అమెరికాలో 10 లక్షల మంది అసువులు బాసారు.

USA
  • Loading...

More Telugu News