YS Vivekananda Reddy: సీబీఐ విచారణకు మూడోసారి హాజరైన అవినాశ్ రెడ్డి
- వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ ఆఫీసులో వైసీపీ ఎంపీ విచారణ
- తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలంటూ కోర్టులో పిటిషన్
- తాను నేరానికి పాల్పడ్డట్లు ఆధారాలు చూపలేదని వాదన
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలిచింది. దీంతో శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసుకు ఎంపీ చేరుకున్నారు. విచారణకు హాజరుకావడం వైఎస్ అవినాశ్ రెడ్డికి ఇది మూడోసారి కావడం గమనార్హం.
గతంలో జనవరి 28న ఒకసారి, ఫిబ్రవరి 24న మరోసారి ఆయనను అధికారులు విచారించారు. మరోవైపు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, దస్తగిరి చంచల్ గూడ జైలులో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉంటున్నారు.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు సీబీఐ రెండు అభియోగపత్రాలు దాఖలు చేసిందని, తాను నేరం చేసినట్లు అందులో ఎలాంటి ఆధారాలు చూపలేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను కోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారించనుంది.