KCR: దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి

CM KCR announces MLC candidates

  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
  • దేశపతి, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డికి అవకాశం
  • సంఖ్యా బలం దృష్ట్యా ఏకగ్రీవం కానున్న ఎన్నిక

ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ పదవి వరించనుంది. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన దేశపతి శ్రీనివాస్ తన రచనలతో ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించి సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం ఓఎస్డీగా నియమితుడయ్యారు.

మరోవైపు హైదరాబాద్ కు చెందిన  నవీన్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మరో పర్యాయం అవకాశం లభించనుంది. ఇక, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కుమారుడు), అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి గతేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సముచిత పదవి ఇస్తామని చేరిక సందర్భంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా ఈ మూడింటినీ బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది. దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

KCR
Telangana
MLC
Election
candidates
deshapati srinivas
  • Loading...

More Telugu News