LR Eswari: 'ఊ అంటావా మావా .. ఒక పాటనా?: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి
- విలక్షణ గాయనిగా ఎల్.ఆర్.ఈశ్వరి
- ఒకప్పటి సిన్సియారిటీ గురించి ప్రస్తావన
- 'ఊ అంటావా' పాటపై అసంతృప్తి
- ఆ పాటను తనకి ఇచ్చి ఉంటే వేరేగా ఉండేదని వ్యాఖ్య
ఎల్.ఆర్.ఈశ్వరి వాయిస్ లో ఒక రకమైన మత్తు ఉంటుంది. పదాల విరుపులో అర్థవంతమైన విరుపు ఆమె గమ్మత్తుగా చేస్తారు. ఆమెను అనుకరించడం కష్టమని ఒప్పుకున్నవారు చాలామందినే కనిపిస్తారు. కైపు ఎక్కించే పాటలను ఆమెతో పాడించడానికే అలనాటి సంగీత దర్శకులు ఉత్సాహాన్ని చూపించేవారు.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఇన్ని ఛానల్స్ లో ఇంతకాలంగా పాటల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ ఎందులోను నా పాటలు ఎవరూ పాడరు .. కారణం తెలియదు. ఈ మధ్య కాలంలో 'ఊ అంటావా మావా' పాటను విన్నాను .. అది ఒక పాటనా? పై నుంచి క్రిందివరకూ ఒకేలా ఉంటుంది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"ఆ పాట నా దగ్గరికి వచ్చి ఉంటే దాని కలరే వేరుగా ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్ చూసుకోవాలి .. పిల్లలకేం తెలుసు .. చెప్పినట్టుగా పాడతారు. మేము పాడిన పాటలు ఇప్పటికీ నిలబడటానికి కారణం మా వర్క్ అంత సిన్సియర్ గా ఉండేది. సినిమాలు కూడా అంతే ఉన్నాయి. అప్పట్లో ఒక్కో సినిమా 250 రోజులు ఆడేవి. ఇప్పుడు 10 రోజులు ఆడితే గొప్పగా చెబుతున్నారు" అంటూ నవ్వేశారు. 'ఊ అంటావా మావా' పాటను ఆమె తనదైన స్టైల్లో పాడటానికి ప్రయత్నించడం విశేషం.