Sree Leela: మంచి మనసును చాటుకుంటున్న యువ హీరోయిన్ శ్రీలీల
- ఓ అనాథాశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల
- చిన్నారులతో ఉల్లాసంగా గడిపిన వైనం
- అనాథ బాలలకు ప్రేమ, ఆప్యాయత పంచితే చాలని పిలుపు
ప్రస్తుతం టాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉన్న యువ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఈ అచ్చ తెలుగు అమ్మాయి వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది. అయితే, శ్రీలీల కేవలం సినిమా నటే కాదు.... శ్రీలీల సామాజిక దృక్పథం కూడా ఉన్న అమ్మాయి. ఆమె గత శనివారం ఓ అనాథ శరణాలయం సందర్శించింది. అక్కడి అనాథ బాలలతో గడిపి వారిని సంతోషంలో ముంచెత్తింది. దీనిపై శ్రీలీల ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది.
ఆ రోజు ఎంతో ఆహ్లాదకరంగా గడిచిపోయిందని వివరించింది. ఆ చిన్నారుల కలలు, వారి జీవితాలు తెలుసుకున్నానని, వారితో ఆడిపాడి, వారిని ముద్దు చేసి ఉల్లాసంగా గడిపానని శ్రీలీల వెల్లడించింది. భారీ విరాళాలు ఇవ్వనక్కర్లేదని, అనాథ చిన్నారులతో ఒకరోజు ఆనందంగా గడపడం ద్వారా వారికి ప్రేమ, ఆప్యాయతను పంచాలని కోరుకుంటున్నానని పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా హియర్ ఫర్ యూ అనే కార్యాచరణ మొదలుపెడుతున్నానని, ఇతరులు కూడా ఏదైనా అనాథాశ్రమాన్ని సందర్శిస్తే దానికి సంబంధించిన ఫొటోలను #Hereforyou అనే హ్యాష్ టాగ్ జోడించి పోస్టు చేయాలని శ్రీలీల సూచించింది.