Border-Gavaskar Trophy: నాలుగో టెస్టులో తొలిరోజు స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి ఉండదా?

Why tickets for Day 1 of 4th Test in Ahmedabad are locked out

  • ఈ నెల 9న టీమిండియా, ఆసీస్ మధ్య అహ్మదాబాద్ లో చివరి టెస్ట్
  • మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు వస్తున్న ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా పీఎం ఆంథోని అల్బనీస్ 
  • తొలి రోజు టికెట్లను బ్లాక్ చేసిన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్
  • మిగతా నాలుగు రోజుల టికెట్ విక్రయాలపై స్పష్టత ఇవ్వని వైనం

బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు వచ్చే గురువారం మొదలుకానుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ స్టేడియానికి వస్తున్నారు.

తొలి రోజు మ్యాచ్ చూసేందుకు ఇద్దరు ప్రధానులు వస్తుండటంతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తొలి రోజుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ లో బ్లాక్ చేసింది. భద్రతా సమస్యలు తలెత్తకూడదనే కారణంతోనే తొలి రోజు ప్రేక్షకులను మ్యాచ్ చూసేందుకు అనుమతించడం లేదని సమాచారం.

‘‘నాలుగో టెస్ట్ తొలి రోజున భారత, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు హాజరవుతారు కాబట్టి.. కొన్ని సీట్లు ‘లాక్ అవుట్’ చేశాం’’ అని జీసీఏ అధికారి ఒకరు చెప్పారు. టిక్కెట్లను బ్లాక్ చేయడానికి నిర్దిష్ట కారణం ఏంటన్నది మాత్రం చెప్పలేదు. తర్వాతి నాలుగు రోజుల టికెట్ల విక్రయాలపైనా స్పష్టతలేదు. 

ఆన్ లైన్ లో తొలి రోజు టికెట్లను బ్లాక్ చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి ప్రధానులిద్దరూ రోజంతా మ్యాచ్ చూడరు. వారికి అంత టైమ్ కూడా ఉండదు. కొద్దిసేపు లేదా.. ఒకటీ రెండు గంటలు మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఉంది. కానీ ఆ రోజు టికెట్లను మొత్తాన్ని బ్లాక్ చేయడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు.

సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లు రసవత్తరంగా సాగాయి. 2-1 తేడాతో ఆధిక్యంతో భారత జట్టు ముందుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచినా.. మూడో టెస్టులో ఓడిపోయింది. చివరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకోవాలని, తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News