Sunil Gavaskar: ఇండోర్ పిచ్ కు డీమెరిట్స్.. సునీల్ గవాస్కర్ ఆగ్రహం

Sunil Gavaskar Gives Brisbane Reference As Poor Indore Pitch Gets 3 Demerit Points

  • గతేడాది ఆస్ట్రేలియాలోని గబ్బాలో జరిగిన మ్యాచ్ ను ప్రస్తావించిన గవాస్కర్
  • నాటి మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిందని, పిచ్ ప్రమాదకరంగా ఉండిందని వ్యాఖ్య
  • మరి గబ్బా పిచ్ కు ఎన్ని డీమెరిట్స్ ఇచ్చారని నిలదీత
  • డీమెరిట్ పాయింట్లు ఇచ్చే విషయంలో కొంత సమానత్వం అవసరమంటూ హితవు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ‘పిచ్’ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇండోర్ పిచ్ పూర్ అని పేర్కొంటూ ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించడంపై లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు.

ఆస్ట్రేలియాలోని ‘గబ్బా’ స్టేడియం పిచ్ కంటే ఇండోర్ పిచ్ ఎందులో బాగోలేదో చెప్పాలని గవాస్కర్ ప్రశ్నించారు. గబ్బాలో జరిగిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిందని, మరి ఎన్ని డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారని నిలదీశారు. ఓ న్యూస్ చానల్ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. ఇండోర్ పిచ్ కచ్చితంగా కఠినమైనదేనని, వారికి భారతదేశంలో ఎదురయ్యేది అలాంటి పిచ్ లేనని స్పష్టం చేశారు. 

‘‘ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య గబ్బా వేదికగా నవంబర్-డిసెంబర్‌లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అది కూడా రెండు రోజుల్లో ముగిసింది. ఫాస్ట్ బౌలర్లు చాలా ప్రమాదకరంగా కనిపించారు. బ్యాట్స్ మన్ కు వారి వల్ల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఆ పిచ్‌పై ప్రాణహాని ఉంది. మరి ఆ పిచ్ కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు వచ్చాయో, మ్యాచ్ రిఫరీ ఎవరో నాకు తెలియదు. డీమెరిట్ పాయింట్లు ఇచ్చే విషయంలో కొంత సమానత్వం అవసరమని నేను భావిస్తున్నా’’ అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News