Appalaraju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ స్వతంత్ర అభ్యర్థి ముసుగులో పోటీ చేస్తోంది: మంత్రి అప్పలరాజు

Minister Appalaraju comments on TDP

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు చోట్ల వైసీపీ ఏకగ్రీవం
  • శ్రీకాకుళంలో ఎదురుదెబ్బ
  • బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ఆనెపు రామకృష్ణ

ఏపీలో మరికొన్నిరోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అగ్రనేతలు శ్రీకాకుళంలో అత్యవసర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి ముసుగులో టీడీపీ పోటీ చేస్తోందని ఆరోపించారు. 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే ఐదు చోట్ల ఏకగ్రీవం చేసుకోగా, శ్రీకాకుళంలో వారి ఏకగ్రీవం ఆశలకు స్వతంత్ర అభ్యర్థి ఆనెపు రామకృష్ణ అడ్డుతగిలారు. టీడీపీ తరఫున అభ్యర్థి ఎవరూ బరిలో లేకపోయినా, స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉండడంతో శ్రీకాకుళంలో ఎన్నిక తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాయబారాలకు కూడా వీల్లేకుండా ఆనెపు రామకృష్ణ ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఇక, నేటి విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఓటర్లందరూ డివిజన్ కేంద్రాలకు ఒకరోజు ముందే చేరాలని సూచించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలనుకుంటున్నామని వివరించారు. 

మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ, యాదవులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. తూర్పు కాపు కులాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. తూర్పు కాపు పేరుతో ట్రాప్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగి ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తామని ధర్మాన హెచ్చరించారు. 

ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితి ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. బీసీలకు న్యాయం చేస్తున్న వ్యక్తి జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. మహిళలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నదే జగన్ ఆశయం అని స్పష్టం చేశారు.

Appalaraju
MLC Elections
YSRCP
TDP
Srikakulam
  • Loading...

More Telugu News